కడప, 12 ఆగస్టు (హి.స.)
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ నేపథ్యంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... రెండు చోట్ల కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కూటమి గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదని అన్నారు. వైసీపీ అరాచకాలకు తెరదించేలా ఓటర్లు తీర్పును ఇవ్వబోతున్నారని చెప్పారు.
ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరుగుతుంటే... తమ అరాచకాలు, ఎత్తులు సాగడం లేదని వైసీపీ తీవ్రంగా బాధపడుతోందని పల్లా ఎద్దేవా చేశారు. ఏదో రకంగా ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు వైసీపీ పసలేని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి 'సేవ్ డెమోక్రసీ' అంటూ గగ్గోలు పెడుతూ ఓటర్ల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఓటర్లు వీరి కుయుక్తులను పసిగట్టారని... వీరికి దిమ్మతిరిగే తీర్పును ఇవ్వబోతున్నారని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి