తెలంగాణ, మంచిర్యాల.13 ఆగస్టు (హి.స.)
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని నర్సాపూర్ గిరిజన గ్రామానికి చెందిన గర్భిణి యమునకు బుధవారం ఉదయం పురిటి నొప్పు వచ్చాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు మండలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షంతో కురిసింది. దీంతో నరసాపూర్ సమీపంలోని వాగు ఉప్పొంగి వరదనీరు ఉధృతంగా ప్రవహించింది. గర్భిణినీ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వాగులోని వరద ఉధృతికి ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న తాండూర్, మాదారం ఎస్సైలు కిరణ్ కుమార్, సౌజన్య తమ సిబ్బందితో వాగు వద్దకు చేరుకున్నారు. వాగు ఉధృతి కారణంగా గర్భిణిని పోలీసులు స్థానికుల సహాయంతో తాడుతో వాగు అవతలికి దాటించారు. అనంతరం ఆమెను 108 అంబులెన్స్ లో బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. వాగు ఉధృతి ప్రవాహం వల్ల పోలీసులు సాహసం చేసి నిండు గర్భిణిని వాగు దాటించడం పట్ల గిరిజనులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు