అమరావతి, 13 ఆగస్టు (హి.స.)ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదులుతోంది. రాబోయే 24 గంటల్లో మరింత బలపడ నుంది. 48 గంటల్లో ఉత్తర తీరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం జూలకల్లులో భారీగా వరద వచ్చి చేరింది. కొత్త బ్రిడ్జి నిర్మాణం వద్ద రోడ్డుపై నీటి ప్రవాహంతో వాహనాలకు అంతరాయం ఏర్పడింది.
పిడుగురాళ్ల-కారంపూడి వెళ్లే రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జేసీబీతో రాకపోకలకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగిరి కాజా టోల్ ప్లాజా జలదిగ్భందంలో చిక్కుకుంది. గుంటూరు-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంగళగిరి ఎన్ఆర్ఐ జంక్షన్ దగ్గర భారీగా వరద నీరు చేరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి