కలెక్టర్ ఆదేశాలంటే లెక్క లేదా.. ఆర్డీవో పనితీరుపై సిరిసిల్ల కలెక్టర్ ఆగ్రహం
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 4 ఆగస్టు (హి.స.) కలెక్టర్ ఆదేశాలు అంటే లెక్క లేదా..? ఆర్డర్ ఇచ్చిన పని చేయరా..! అంటూ సిరిసిల్ల ఆర్డీవో పనితీరుపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని ప్రజావాణిలో ఆయన అధికారులను ఘ
సిరిసిల్ల కలెక్టర్


తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 4 ఆగస్టు (హి.స.)

కలెక్టర్ ఆదేశాలు అంటే లెక్క లేదా..? ఆర్డర్ ఇచ్చిన పని చేయరా..! అంటూ సిరిసిల్ల ఆర్డీవో పనితీరుపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని ప్రజావాణిలో ఆయన అధికారులను ఘాటుగా హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొలకాని శంకరయ్య, లస్మయ్య ఇద్దరు అన్నదమ్ములకు చెందిన 28 గుంటల వారసత్వ భూమిని లస్మయ్య కొడుకు రవి శంకరయ్యకు తెలియకుండా 1996లో అక్రమంగా పట్టా చేసుకున్నాడు. 2016 లో ధరణి పోర్టల్ లో చూడగా తన భూమి అక్రమ పట్టా అయ్యిందని గ్రహించిన శంకరయ్య ఆయన కంగుతిన్నారు. అప్పటి నుంచి కుల పెద్ద మనుషులు, గ్రామ పంచాయతీ, పోలీస్ స్టేషన్ ఇలా ఎన్ని తిరిగిన శంకరయ్య సమస్య తీరలేదు. గత ఏడాది ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు శంకరయ్య తమ సమస్యను తీర్చాలని అర్జీ పెట్టుకున్నారు. వెంటనే ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో ద్వారా విచారణ చేపట్టగా అది అక్రమ పట్టా అని తేలింది. దీంతో శంకరయ్య, లస్మయ్య వారసత్వ భూమిని సమానంగా పట్టా చేయాలని కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు.

ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో తన దగ్గర చేయవలసిన పని మొత్తం పూర్తి చేసి, సిరిసిల్ల ఆర్డీవోకు ఫైల్ పంపించారు.

కాగా సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో శంకరయ్య మళ్ళీ పట్టా చేయడం లేదంటూ జిల్లా కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నాడు. దీంతో తాను ఆదేశాలు ఇచ్చిన రైతు శంకరయ్య సమస్య ఎందుకు పరిష్కరించలేదంటూ సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ గా నేను ఆదేశాలు ఇచ్చిన పని చేయరా అంటూ ప్రజావాణిలో ఆర్డీవో పని తీరుపై మండిపడ్డారు. పనిచేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని అధికారులకు చెప్పకనే చెప్పినట్లు ఘాటుగా హెచ్చరించారు. అంతేకాకుండా ప్రజావాణి తర్వాత కూడా సిరిసిల్ల ఆర్డిఓకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande