పటాన్చెరు, 4 ఆగస్టు (హి.స.)
భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి (ఐసీఎస్ఎస్ఆర్) సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని రాజకీయ శాస్త్ర (పొలిటికల్ సైన్స్) విభాగం 'సర్దార్ వల్లభాయ్ పటేల్, రైతులు: చంపారన్ నుంచి చిత్రకూట్ వరకు' అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. జాతీయ చర్చాగోష్ఠి ప్రారంభోత్సవానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.
తన ప్రారంభోపన్యాసంలో గవర్నర్ మాట్లాడుతూ రైతులను ఏకం చేయడంలో, భారతదేశ వ్యవసాయ ఉద్యమాన్ని రూపొందించడంలో సర్దార్ పటేల్ పోషించిన కీలక పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. వ్యవసాయ రంగంలో ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడంలో ఐక్యత ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో గుజరాత్ ప్రభుత్వ INDEXT-C ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ జోషి, ఐఏఎస్; సామాజిక సమరస్థ మంచ్ జాతీయ కన్వీనర్ శ్రీ కె.శ్యామ్ ప్రసాద్; గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖ పండితులు, ఆలోచనాపరులు ఈ రెండు రోజుల జాతీయ చర్చాగోష్ఠి లో పాల్గొంటున్నారు. వీరిలో గుజరాత్ లోని సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వసంత్ కుమార్ ఆర్. పటేల్, తెలంగాణలోని ములుగులోని సమ్మక్క సారక్క గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్.శ్రీనివాస్; ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం ఇన్ చార్జ్ రిజిస్ట్రార్ అండ్ డీన్ ప్రొఫెసర్ షీలా రెడ్డి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జి. నాగరాజు,అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి, ఐసీఎస్ఎస్ఆర్ దక్షిణ ప్రాంత డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి, యూజీసీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ జి.గోపాల్ రెడ్డి తదితరులున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్