ఆధిపత్య ధోరణిని తగదు
విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్
Source -x@drsjaishankar


హైదరాబాద్, 5 ఆగస్టు (హి.స.)భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) మాట్లాడుతూ అమెరికా సుంకాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈసందర్భంగా ఆధిపత్య ధోరణిని ప్రదర్శించకూడదని వ్యాఖ్యానించారు.

దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం సంక్లిష్టమైన, అనిశ్చితి కాలంలో జీవిస్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పారదర్శకమైన, సమప్రాతినిధ్య ప్రపంచీకరణ వ్యవస్థ అవసరమని వ్యాఖ్యానించారు. అంతేకానీ, కొంతమందిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించే ధోరణి ఉండకూడదంటూ ఎద్దేవా చేశారు. ఈసందర్భంగా సంప్రదాయాలకు ప్రత్యేక విలువలు ఉంటాయని, అవే చివరికి గుర్తింపు తెస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తును రూపొందించడంలో మనపై మనకు నమ్మకం ఉండాలన్నారు. మనలాంటి దేశాలకు, సంప్రదాయాలే నిజమైన బలాలని వ్యాఖ్యానించారు.

భారత దిగుమతులపై ట్రంప్ ఇప్పటికే 25శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా ఆయన మరోసారి తన అక్కసు వెళ్లగక్కుతూ.. సుంకాలను మరింత పెంచుతానని హెచ్చరించారు. రష్యా యుద్ధంలో ఉక్రెయిన్‌లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాటన్నింటిని భారత్‌ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే ఆ దేశంపై గణనీయంగా సుంకాలు పెంచుతానన్నారు. కాగా.. ట్రంప్ హెచ్చరికలను భారత్‌ తిప్పికొట్టింది. ఉక్రెయిన్‌ ఘర్షణ అనంతరం- అంతర్జాతీయ విపణిలో తలెత్తిన పరిస్థితుల వల్లే.. దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande