విశాఖపట్నం, అమరావతి, 5 ఆగస్టు (హి.స.)
ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం మూ కొనసాగింది. దీనికితోడు ఉత్తర తమిళనాడు మీదుగా తూర్పున బంగాళాఖాతం నుంచి పడమర అరేబియా సముద్రం వరకూ ఉపరితలద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో వచ్చే 36 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అక్కడక్కడ భారీ వర్షాలు పడ్డాయి. కాళహస్తి సమీప రాచగున్నేరిలో 81.5, నెల్లూరు జిల్లా వెలగపాడులో 73, చిత్తూరు జిల్లా యడమర్రిలో 67, కాకినాడ జిల్లా కరపలో 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగింది. మంగళవారం కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ, కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బుధవారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం మన్యం, అల్లూరి జిల్లాలతో పాటు రాయలసీమలో పలు చోట్ల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి