శ్రీనగర్, 5 ఆగస్టు (హి.స.)జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తారంటూ ప్రధాన స్రవంతి మీడియాతో పాటు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసి నేటితో (ఆగస్టు 5) ఆరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ఒకే రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడంతో ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. దీనిపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ ప్రచారంపై నిన్న 'ఎక్స్' వేదికగా స్పందించారు.
రాష్ట్ర హోదాపై కీలక ప్రకటన వస్తుందని చాలా మంది భావిస్తుండగా, ఈ వార్తలను ముఖ్యమంత్రి అబ్దుల్లా ఖండించారు. జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తారనే వార్తలు తన దృష్టికి వచ్చాయని, అయితే అవి నిజమని తాను నమ్మడం లేదని ఆయన అన్నారు. ఆగస్టు 5న ఏమీ జరగదని తాను మనస్పూర్తిగా విశ్వసిస్తున్నానని చెబుతూ, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
2019 ఆగస్టు 5న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్, లడఖ్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన విషయం విదితమే.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి