ఢిల్లీ, 6 ఆగస్టు (హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్ పై మరోసారి పన్నులు విధిస్తామని, 24 గంటల్లోనే నిర్ణయం తీసుకుంటామంటూ తీవ్ర హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంగానే ట్రంప్ ఈ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ (Ajit Doval) రష్యా పర్యటనకు సిద్ధమవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. ట్రంప్ హెచ్చరికలకు ముందే ఆయన రష్యా పర్యటన ఖరారైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మాస్కోతో రక్షణ, ఇంధన సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నాయి.
రష్యా చమురు సరఫరా, కంపెనీల సహకారం, ఎస్ -400 క్షిపణి వ్యవస్థలు, ఎస్ యూ -57 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలక అంశాలపై మాస్కో అధికారులతో ధోవల్ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ఆగస్టు నెలాఖరులో పర్యటించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి