పెట్రోపావ్లోవ్స్క్-కమ్చాట్స్కీ, 13 సెప్టెంబర్ (హి.స.)
రష్యా తూర్పు తీరంలోని కమ్చత్కా ద్వీపకల్పంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) ప్రకటించింది. ఈ శక్తిమంతమైన భూకంపం నేపథ్యంలో అధికారులు సమీప తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
యూఎస్‌జీఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం కమ్చత్కా ప్రాంత పరిపాలనా కేంద్రమైన పెట్రోపావ్లోవ్స్క్-కమ్చాట్స్కీ నగరానికి తూర్పున 111 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 39.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం సంభవించిన వెంటనే పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం అప్రమత్తమైంది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని రష్యా తీర ప్రాంతాలపై ప్రమాదకరమైన అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది.
అయితే, భూకంప తీవ్రతను యూఎస్‌జీఎస్ తొలుత 7.5గా అంచనా వేసినప్పటికీ, తరువాత దానిని 7.4కు సవరించింది. గత జులై నెలలో కూడా ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పసిఫిక్ అంతటా సునామీ అలలు ఎగసిపడటంతో హవాయి నుంచి జపాన్ వరకు పలు దేశాలు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి