హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)
పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. సచివాలయంలో మంగళవారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భూ సమస్యలపై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్న చిన్న సమస్యలను సాకుగా చూపించి జఠిలం చేయొద్దని అటవీశాఖ అధికారులకు సూచించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 40-50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఐతే నిబంధనలు చూపుతూ ఆ భూములు అటవీ శాఖకు చెందినవని అధికారులు కొర్రీ వేస్తున్నారన్నారు. ఈ అంశంపై రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సమన్వయంతో పని చేసి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు