హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.) బీజేపీ భక్తులు సూడో జాతీయవాదులు అని, కానీ బీఆర్ఎస్ మాత్రం నిఖార్సైన జాతీయవాద పార్టీ అని కేటీఆర్ అన్నారు. తమకు జాతీయవాదం అంటే ప్రతి భారతీయుడిని సమానంగా చూడడం అని, కులం.. మతం.. వర్గంతో బేధభావం లేకుండా ఉంటామన్నారు. జాతీయవాదానికి, అతివాద దేశభక్తి మధ్య ఉన్న తేడాను గమనించాలన్నారు. తన ట్వీట్లో జైహింద్ అని పేర్కొన్న కేటీఆర్ .. పెహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాల మనోవేదనకు చెందిన కొన్ని న్యూస్ క్లిప్లను ప్రజెంట్ చేశారు.
బీజేపీ మద్దతుదారులు రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించడం లేదని కేటీఆర్ అన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డుకుంటూ సుప్రీంకోర్టు స్టే ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతం పలికిందని, కానీ బీఆర్ఎస్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న బీజేపీ భక్తులు .. అటు భారత రాజ్యాంగాన్ని కానీ, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కానీ గౌరవించడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు