న్యూఢిల్లీ,20,సెప్టెంబర్ (హి.స.)
హెచ్-1బీ వీసాదారుల వార్షిక రుసుము లక్ష డాలర్లు విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. నూతన నిబంధనల నేపథ్యంలో అమెరికా వెలుపల ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు (H-1B and H-4 visa employees) సెప్టెంబరు 21లోపు తిరిగిరావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ (Microsoft) తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గత ఈమెయిల్ పంపించినట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం కొంతకాలం పాటు అక్కడే పనిని కొనసాగించాలని సంస్థ సూచించినట్లు సమాచారం.
24గంటల్లోపు తిరిగి వచ్చేయండి: మెటా
హెచ్-1బీ వీసాపై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో జుకర్‌బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటా సైతం తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పూర్తి స్పష్టత వచ్చేవరకు కనీసం రెండు వారాల పాటు అమెరికాలోని ఉద్యోగులు ఎక్కడికీ వెళ్లొద్దని సూచించింది. ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు (H-1B and H-4 visa employees) 24 గంటల్లోపు తిరిగి యూఎస్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. అమెజాన్, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు కూడా ఇదే విధమైన అడ్వైజరీలు జారీ చేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు