ఇస్లామాబాద్:న్యూఢిల్లీ,20,సెప్టెంబర్ (హి.స.) పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీ కారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. ఉగ్రవాద సంస్థలు కకావికలమయ్యాయి. తమకు జరిగిన నష్టంపై నోరువిప్పుతున్నాయి. భారత సైన్యం దాడులతో జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబం ముక్కలైందని ఆ సంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ ఇప్పటికే అంగీకరించాడు. వైమానిక దాడుల్లో బహవల్పూర్ స్థావరం దెబ్బతిన్నదని వెల్లడించాడు.
పాకిస్తాన్‌లోని మరో ముష్కర ముఠా లష్కరే తోయిబా కమాండర్ ఖాసిం కూడా తాజాగా స్పందించాడు. ఆపరేషన్ సిందూర్ కారణంగా తమకు భారీ నష్టం వాటిల్లిందని, తమ ప్రధాన కేంద్రం ‘మర్కజ్ తయిబా’ ధ్వంసమైందని వెల్లడించాడు. మే 7న జరిగిన దాడుల్లో మురిద్కే పట్టణంలోని ఈ కేంద్రం నామరూపాల్లేకుండా పోవడంతో మళ్లీ నిర్మిస్తున్నట్లు చెప్పాడు. ధ్వంసమైన భవనం కంటే.. ఈసారి భగవంతుడి దయతో పెద్ద భవనం నిర్మిస్తున్నామని తెలియజేశాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు