హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్రంలో రేషన్ డీలర్ల వ్యథపై మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' వేదికగా ట్వీట్ చేశారు. నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గమని అన్నారు. నిరుపేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ, వారి ఆకలి తీర్చుతున్న రేషన్ డీలర్లకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరుతో పస్తులుండే పరిస్థితి రావడం శోచనీయమని కామెంట్ చేశారు. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్ అందక వారు ఇబ్బందులు పడుతుంటే సర్కార్ మొద్దు నిద్ర నటిస్తుండటం దారుణమని అన్నారు. అభయహస్తం పేరిట విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్ పెంపు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా హామీలపై నేటికీ అతీగతీ లేదన్నారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో నమ్మించి ఇప్పుడు నట్టేట ముంచేస్తున్నారని ఫైర్ అయ్యారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు