బెంగళూరు, 23 సెప్టెంబర్ (హి.స.) టెక్ సిటీ బెంగళూరు శిథిలావస్థకు చేరుకుంటోందని.. టెక్ హబు గుంతల నగరంగా మార్చారంటూ కేంద్ర మంత్రి హెచిడి కుమారస్వామి ఇటీవల ఆరోపించారు. రోడ్డు పరిస్థితులు బాగోలేకపోవడంతో కంపెనీలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయని తెలిపారు. బీజేపీ ఆరోపణలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ స్పందించారు.
“రోడ్లపై గుంతలు కేవలం కర్ణాటకలోనే ఉన్నాయా? నిన్న నేను ఢిల్లీలోకి వెళ్తే ప్రధాని మోడీ నివాస రోడ్డులో కూడా గుంతలు కనిపించాయి. కానీ మీడియా మాత్రం కర్ణాటక రోడ్లనే మాత్రమే చూపిస్తున్నాయి.” అని డీకే.శివకుమార్ తిప్పికొట్టారు. భారీ వర్షాలు కారణంగా దేశ వ్యాప్తంగా రోడ్లు గుంతలమయం అయ్యాయన్నారు.
అయినా కూడా ఓ వైపు వర్షాలు పడుతున్నప్పటికీ వేలాది గుంతలు పూడ్చుతూనే ఉన్నామని చెప్పారు. దేశ వ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని.. దీనికి బీజేపీనే కారణం అన్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలోనే గుంతలను బీజేపీ చూపిస్తోందని ధ్వజమెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..