హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తు, సేవల పన్ను (GST) విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ వైఖరిపై విమర్శలు చేశారు. GSTని ప్రవేశపెట్టినప్పుడే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దానిని గబ్బర్ సింగ్ ట్యాక్స్గా అభివర్ణించారని, ఇది దేశ ప్రజలకు దోచుకునే ఆయుధంగా మారిందని ప్రభాకర్ అన్నారు. పెట్రోల్, డీజిల్ వంటి వాటిని GST పరిధిలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ సూచించినా.. మోదీ ప్రభుత్వం దానిపై స్పందించలేదని ఆయన పేర్కొన్నారు.
అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరు నెలల్లో GST ద్వారా రూ.22 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పడం అంటే, ఆరు నెలల్లో పేద ప్రజల నుంచి అంత మొత్తాన్ని దోచుకున్నట్టేనని ప్రభాకర్ ఆరోపించారు. ఇన్ని రోజులు ప్రజల రక్తం పీల్చుకుని, ఇప్పుడు పన్నులు తగ్గించి సంబరాలు చేసుకోవడం మూర్ఖత్వమని ఆయన అన్నారు. GST తగ్గిందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా, నిత్యావసర వస్తువుల ధరలు ఏమైనా తగ్గాయా..? అని ప్రశ్నించారు. ఈ పన్ను పెంచింది ఎవరు? తగ్గించింది ఎవరు? అని అన్నారు. ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు నిజంగా లాభం జరిగిందా..? లేదా..? అని చూడాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..