తెలంగాణ, నల్గొండ. 23 సెప్టెంబర్ (హి.స.)
రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. యూరియా కొరత కారణంగా గత కొన్ని రోజులుగా పడరాని పాట్లు పడుతున్నారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక సహకార సంఘం భవనంలో యూరియా ఇస్తున్నారన్న సమాచారంతో సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున సహకార సంఘ భవనం వద్దకు చేరుకున్నారు. తెల్లారి జాము నుండి యూరియా కోసం రైతులు సంఘ భవనం ముందు క్యూ కట్టారు. సహకార సంఘానికి మంగళవారం సుమారు 860 బస్తాల యూరియా రావడంతో రైతులకు రెండు బస్తాల చొప్పున టోకెన్లు విడుదల చేశారు.
కాగా గత పది రోజులుగా అడపాదడపా వర్షాలు పడుతుడడంతో పత్తి, మిరప పంటలకు యూరియా అవసరాల కోసం రైతులు తెల్లవారే సరికే దుకాణాలు సహకార సంఘాల భవనాల వద్ద బారులు తీరుతున్నారు. ఇదిలా ఉండగా హలియా, నిడమనూరు, త్రిపురారం మండలాల్లో కొంతమంది ఫర్టిలైజర్ వ్యాపారులు అధిక ధరలకు యూరియా కొనుగోలు చేసి బస్తా ఒక్కంటికి రూ.450 నుండి రు.500 రూపాయల వరకు అమ్ముతున్నట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు