విజయవాడ, 23 సెప్టెంబర్ (హి.స.) దసరా నవరాత్రుల వేళ.. బెజవాడ వేదికగా ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని స్థానిక ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.
భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. బుధవారం ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. విజయవాడలో ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఈ రోజు మంగళవారం విజయవాడలో ఉన్నతాధికారులతో ఎంపీ కేశినేని చిన్ని సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎంపీ కేశినేని చిన్ని విలేకర్లతో మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి సీపీ రాధాకృష్ణన్ విజయవాడ పర్యటనకు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సైతం అధిక సంఖ్యలో పాల్గొనున్నారని చెప్పారు. ఇక మంగళవారం ఈ ఉత్సవ్‌కు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారని పేర్కొన్నారు.
అయితే ఈ విజయవాడ ఉత్సవ్‌కు రోజుకు ఒక ప్రముఖులు హాజరవుతారని వివరించారు. అందులో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ మరునాడు అంటే సెప్టెంబర్ 29వ తేదీన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు హాజరువుతారని తెలిపారు. డ్రోన్ షో ఆంధ్రప్రదేశ్ వైభవాన్ని తెలిపే విధంగా ఉంటుందని ఎంపీ కేశినేని చిన్ని వివరించారు. కూటమి నేతలు అందరూ కలిసి ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి