తిరుమల, 23 సెప్టెంబర్ (హి.స.)
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రేపు 24 నుంచి అక్టోబరు 2 వరకు జరగనున్న ఈ వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి సామాన్య భక్తులకే అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
మాడ వీధుల్లో స్వామివారి వాహన సేవలను కనులారా వీక్షించేందుకు గంటల తరబడి వేచి ఉండే భక్తులకు ఈ ఏడాది ప్రత్యేకంగా 16 రకాల వంటకాలను అందించనున్నారు. రద్దీని నియంత్రించేందుకు, ప్రతి 45 నిమిషాలకు ఒకసారి సుమారు 35,000 మంది భక్తులను రీఫిల్లింగ్ పద్ధతిలో గ్యాలరీల్లోకి అనుమతించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మాడ వీధుల బయట ఉన్న భక్తులు కూడా ఉత్సవాలను చూసేందుకు వీలుగా 36 భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.
పటిష్ఠ భద్రత, సాంకేతికత వినియోగం
బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతకు టీటీడీ పెద్దపీట వేసింది. 3,000 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయగా, 4,700 మంది పోలీసులు, 2,000 మంది టీటీడీ భద్రతా సిబ్బంది భక్తులకు రక్షణ కల్పించనున్నారు. భక్తుల సేవలో 3,500 మంది శ్రీవారి సేవకులు పాలుపంచుకోనున్నారు. కొండపైకి రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రతి 4 నిమిషాలకు ఒక బస్సును నడపనున్నారు.
ఈసారి పారిశుద్ధ్య నిర్వహణ కోసం టీటీడీ సాంకేతికతను వినియోగిస్తోంది. సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు, భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ స్వీకరించేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. భక్తులు ఎక్కడపడితే అక్కడ వదిలివేసే చెప్పుల సమస్యను అధిగమించేందుకు వినూత్నంగా క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా సమస్య 90 శాతం పరిష్కారమైందని అధికారులు చెబుతున్నారు.
పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం: అదనపు ఈవో
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కా కార్యాచరణ రూపొందించామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. సామాన్య భక్తుల వసతి కోసం తిరుమలలోని మఠాల నుంచి 60 శాతం గదులు తీసుకున్నాం. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ ఉంటుంది. రోజూ 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతాం. ఎంత రద్దీ ఉన్నా ఎదుర్కొనేందుకు సూక్ష్మస్థాయి ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాం అని ఆయన వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి