కర్నూలు, 24 సెప్టెంబర్ (హి.స.)
ఆకుకూరల్లో బచ్చలి కూరకి ప్రత్యేకమమైన స్థానం ఉంది. దీనిలో పోషకాలతో పాటు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు నిండివున్నాయి. ఈ బచ్చలి కూరలో రెండు రకాలు ఉన్నాయి. తీగబచ్చలి, కాడబచ్చలి. ఎక్కువగా కాడబచ్చలి మనకి దొరుకుతుంది. తీగబచ్చలిని ఇంటి పెరట్లోకూడా పెంచుకోవచ్చు. ఈ కూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుకూర తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి..? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం…
ఇందులో సెలీనియం, నియాసిన్ , ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల మెదడు, నరాల ఆరోగ్యానికి మంచిది. బచ్చలి ఆహారంలో చేర్చుకోవటంవల్ల చర్మానికి కొత్త మెరుపును ఇస్తుంది. బచ్చలి ఆకు రసానికి చెంచాడు తేనె కలిపి ప్రతిరోజూ తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారు బచ్చలి కూరను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. బచ్చలి ఆకులను కందిపప్పుతో తింటే గర్భిణీలు ఎదుర్కొనే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. బచ్చలికూర శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.. కొన్ని ఆకులు నూరి కణతకు పెడితే.. తలలోని వేడి కూడా తగ్గుతుంది.
బచ్చలి కూరలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. బచ్చలి కూరలో విటమిన్ ఎ, లుటీన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యానికి ముఖ్యమైనవి. బచ్చలి కూరలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి