గుంటూరు ,24 సెప్టెంబర్ (హి.స.), జిల్లాలో రోజు రోజుకు కలరా కేసులు (Cholera Cases Rise) పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో కలరా కేసులు పదికి చేరాయి. కొందరు బాధితులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వారి నమూనాలు సేకరించిన వైద్యులు ల్యాబ్‌కు పంపి పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురికి కలరా సోకినట్లు గుర్తించారు. ఇక నగరంలో ఇప్పటికే ముగ్గురికి కలరా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సంఖ్య పదికి చేరింది. అటు తెనాలి మండలం అంగలకుదురులో మరొకరు కలరా వ్యాధి బారిన పడ్డారు. ఎయిమ్స్‌లో కలరా సోకిన బాధితులంతా నలబై ఏళ్ళ లోపు వారే.
గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి వచ్చిన మరొకరికి కలరా సోకినట్లు గుర్తించారు. కలరా ఉధృతితో వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గుంటూరు నగర వ్యాప్తంగా ఎక్కడిక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహించి కలరా బాధితులను గుర్తించే పని పడ్డారు. సాధారణ లక్షణాలు ఉన్నవారికి వైద్య శిబిరంలోనే చికిత్స అందిస్తుండగా.. లక్షణాలు విపరీతంగా ఉన్న బాధితులను చికిత్స నిమిత్తం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి