దిల్లీ: 24 సెప్టెంబర్ (హి.స.) దేశంలో ఓట్ల చోరీ జరుగుతున్నంత కాలం నిరుద్యోగం, అవినీతి పెరిగిపోతూనే ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. ఓట్ల దొంగతనాన్ని, ఉద్యోగాల దొంగతనాన్ని యువత ఇక సహించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ మంగళవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశవ్యాప్తంగా యువత నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం అని వివరించారు. నిజంగా ప్రజల విశ్వాసం పొంది, వారి ఓట్లతో అధికారంలోకి వచి్చన ఏ ప్రభుత్వమైనా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తుందని తెలిపారు.
కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిజాయతీగా, ప్రజల మద్దతుతో అధికారంలోకి రాలేదని స్పష్టంచేశారు. ఓట్లను దొంగిలించి, వ్యవస్థలను శాసించి అధికారంలోకి వచి్చందని ఆరోపించారు. అందుకే దేశంలో నిరుద్యోగంలో గరిష్ట స్థాయికి చేరిందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితి రావడంతో గత 45 ఏళ్లలో ఇదే మొదటిసారి అని వెల్లడించారు. ఉద్యోగాల సంఖ్య నానాటికీ తగ్గిపోతోందని, నియామక ప్రక్రియ కుప్పకూలిందని, ఫలితంగా యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తంచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ