హైదరాబాద్, 4 సెప్టెంబర్ (హి.స.) జీఎస్టీ సవరణ నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ పి. చిదంబరం తాజాగా స్పందించారు. జీఎస్టీ హేతుబద్ధీకరణ, రేట్లు తగ్గించడాన్ని స్వాగతించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఎనిమిదేళ్లు ఎందుకు పట్టిందంటూ అడిగారు . ఇంతకాలం తర్వాత ప్రభుత్వం హఠాత్తుగా ఈ మార్పులు చేయడానికి గల కారణాలపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మందగించిన ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న కుటుంబ అప్పులు, పడిపోతున్న పొదుపు, త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలు లేదా అమెరికా టారిఫ్ల ఒత్తిడి.. జీఎస్టీ రేట్ల తగ్గింపుకు వీటన్నింటిలో ఏదో ఒక కారణమా..? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్లో వరుస పోస్టులు పెట్టారు. అయితే, తాజా నిర్ణయంతో పేద, మధ్యతరగతి వర్గాలకు కొంత ఉపశమనం లభిస్తుందని చిదంబరం అభిప్రాయపడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..