హైదరాబాద్, 4 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పొలం పనులు వదిలి సహకార సంఘాల వద్ద కాపుకాస్తున్నారు. తిండి తిప్పలు మాని, ఎండ వానాలను లెక్కచేయకుండా తిప్పలు పడుతున్నారు. యాదాద్రి జిల్లా అడ్డగూడురులో సహకారం సంగం వద్దకు గురువారం తెల్లవారుజామునే రైతులు, మహిళలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. భారీగా లైను ఉండటంతో.. వారిని చూసిన అధికారులు ఒక్కొక్కరికి ఒక్కో బస్తా మాత్రమే ఇస్తామని చెప్పారు. కోపోద్రిక్తులైన అన్నదాతలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు రెండు బస్తాలు కావాలంటూ వాదించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.
మరోవైపు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలోని ఏపూర్లో బుధవారం రాత్రే సహకారం సంఘం వద్దకు రైతులు చేరుకున్నారు. గురువారం ఉదయం పెద్ద సంఖ్యలో అన్నదాతలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో.. చెప్పులు, కర్రలు, టిఫిన్ బాక్సులు, రాళ్లు, చెట్ల కొమ్మలు లైనులో పెట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..