అమరావతి,5 సెప్టెంబర్ (హి.స.)
ఎంతో బాధ్యతాయుతంగా పని చేస్తూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అతి నీచంగా చిత్రీకరిస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న వైసీపీ చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఫేక్ హ్యాండిల్స్ ద్వారా ఫేక్ విషయాలను ప్రచారం చేసే వైసీపీ చర్యలను అర్థం చేసుకుని తగిన రీతిలో స్పందించాల్సిందిగా టీచర్లను కోరుతున్నానని అన్నారు మంత్రి నారా లోకేష్.
వైసీపీ తన ఫేక్ హ్యాండిల్‌లో నేడు ఒక ఫొటోను షేర్ చేసిందని... ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న టీచర్లు తాగి బెంచీల కింద పడుకుంటున్న రీతిలో అతి జుగుప్సాకరంగా అందులో వ్యాఖ్యానం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చిన ఫొటోను ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లు చెప్పడం, దానిపై దారుణంగా వ్యాఖ్యానించడం క్షమించరాని నేరమని హెచ్చరించారు. ఇలాంటి నేరాలను ఇప్పటికే చాలాసార్లు వైసీపీ చేసిందని ధ్వజమెత్తారు. విద్యను నేర్పే గురువులపైనా అతి నీచంగా వ్యవహారించిన వైసీపీ నీతిబాహ్యమైన చర్యల్లో మరో మెట్టు కిందికి దిగజారిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి