చంద్రబాబుకు సరికొత్త హెలికాప్టర్.. ఇక మరింత వేగంగా పర్యటనలు
అమరావతి, 5 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆయన పర్యటనల కోసం ప్రభుత్వం అత్యాధునిక హెలికాప్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెండు వారాలుగా ముఖ్యమంత్రి తన జిల్లా పర్యటనల కోసం ఈ సరికొత్త హెలికాప్ట
chandrababu-naidu-gets-new-helicopter-for-faster-travel


అమరావతి, 5 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆయన పర్యటనల కోసం ప్రభుత్వం అత్యాధునిక హెలికాప్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెండు వారాలుగా ముఖ్యమంత్రి తన జిల్లా పర్యటనల కోసం ఈ సరికొత్త హెలికాప్టర్‌లోనే ప్రయాణిస్తున్నారు. భద్రతా ప్రమాణాలతో పాటు, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన కారణం.

ఇప్పటివరకు వినియోగించిన పాత బెల్ హెలికాప్టర్ స్థానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్‌బస్ హెచ్-160 మోడల్‌ను ముఖ్యమంత్రి వినియోగం కోసం ఎంపిక చేశారు. కేవలం భద్రతే కాకుండా, ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ హెలికాప్టర్ అనువుగా ఉంటుందని నిపుణులు సూచించడంతో ఈ మార్పు చేసినట్టు తెలుస్తోంది.

ఈ కొత్త హెలికాప్టర్ రాకతో ముఖ్యమంత్రి ప్రయాణ సమయం గణనీయంగా ఆదా కానుంది. గతంలో ఏదైనా జిల్లా పర్యటనకు వెళ్లాలంటే ఆయన ముందుగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సి వచ్చేది. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సంబంధిత జిల్లాకు సమీపంలోని ఎయిర్‌పోర్టుకు వెళ్లి, ఆ తర్వాత రోడ్డు మార్గంలో కార్యక్రమ స్థలానికి చేరుకునేవారు. ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టేది. అయితే, ఇప్పుడు నేరుగా తన నివాసం నుంచే ఈ కొత్త హెలికాప్టర్‌లో జిల్లాలకు వెళ్లే సౌలభ్యం ఏర్పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande