ఓనం పండుగ.. 10 రోజులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
అమరావతి, 5 సెప్టెంబర్ (హి.స.) ఓనం కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ. పంటలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుకలో చిన్నా పెద్దా అందరూ కలసి పాల్గొంటారు. మహాబలి చక్రవర్తిని స్మరించుకుంటూ, కేరళ వారసత్వాన్ని చాటి చెప్పే విధంగా పది రోజుల పాటు
ఓనం పండుగ


అమరావతి, 5 సెప్టెంబర్ (హి.స.) ఓనం కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ. పంటలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుకలో చిన్నా పెద్దా అందరూ కలసి పాల్గొంటారు. మహాబలి చక్రవర్తిని స్మరించుకుంటూ, కేరళ వారసత్వాన్ని చాటి చెప్పే విధంగా పది రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. ప్రతి రోజుకీ ఒక ప్రత్యేక పేరు, ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. అయితే, పది రోజుల పండుగ వెనుక ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. అథం (Atham)

ఓనం ఆరంభదినం అథం. ఇళ్లను శుభ్రం చేసి, పూలతో అలంకరించే ‘పూకలం’ ( పువ్వుల రంగోలి) ప్రారంభమవుతుంది. పండుగ మొదలైన సంకేతం ఇదే. ఈ రోజున కేరళలోని మహిళలు సాంప్రదాయ తెల్లటి కసావు చీరలు ధరించి, బంగారు ఆభరణాలతో అందంగా తయారవుతారు. వారు తమ ఇళ్లను పూలతో అలంకరించి, పులిస్సేరి, ఖీర్ వంటి వంటకాలు చేస్తూ పండుగ జరుపుతారు.

2. చితిర (Chithira)

ఓనం పండుగ రెండో రోజున ఇళ్ల ముందు వేసే పూకలానికి ( పువ్వుల రంగోలికి) కొత్త పూలను జోడించి ఇంకా అందంగా అలంకరిస్తారు. అలాగే పూజలు చేసి, ఆచారాలు పాటిస్తూ మహాబలి చక్రవర్తిని స్వాగతం పలికినట్టుగా వేడుకలు జరుపుకుంటారు.

3. చోధి (Chodi)

మూడవ రోజు అనేది సాంస్కృతిక కార్యక్రమాల రోజు. అందరూ కలసి పాటలు పాడి, నాటకాలు వేసి, నృత్యాలు చేస్తూ పండుగను ఆనందంగా జరుపుకుంటారు.

4. విశాఖం (Vishakam)

ఓనం నాలుగో రోజు విశాఖం నాడు కుటుంబ సభ్యులంతా కలిసి వేడుకలు చేస్తారు. ఆ రోజున మహాబలి చక్రవర్తి, వామనుడి చిన్న మట్టి విగ్రహాలను ఇంటి ఆవరణలో ప్రతిష్టిస్తారు. మహాబలి దాతృత్వాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనతో పాటు వామనుడి విగ్రహాలను పెట్టి పూజలు చేస్తారు. కుటుంబాలంతా కలసి ఈ ఆచారాన్ని పాటిస్తూ ఆనందంగా ఉత్సవాన్ని జరుపుకుంటారు.

5. అనిజం (Anizham)

ఓనం ఐదవ రోజు (అనిజం రోజున) పడవ పోటీలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ పడవ పందేలలో పెద్ద పడవలలో వందలాది మంది ఒకే సారి పడవను నడుపుతూ, పాటలు పాడుతూ పోటీ పడతారు. కేరళలో ఓనం పండుగలో అత్యంత ఉత్సాహభరితమైన కార్యక్రమం ఇది. ఈ పడవ పోటీలు కేరళలో ఓనం ఉత్సవానికి ప్రాణం లాంటివి.

6. త్రికేట (Thriketa)

ఈ రోజున విందు ఏర్పాట్లు మొదలవుతాయి. పెద్దలు, పిల్లలు అందరూ కలసి విందు తయారీలో సహాయం చేస్తారు. ఇంటి అలంకరణలు, పూలతో చేసే పూకలం కూడా కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలసి ఉండటం వలన పండుగ వాతావరణం మరింత ఆనందంగా మారుతుంది.

7. మూలం (Moolam)

మూలం నాడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. పూకలం( పూల రంగొలి) కొత్త డిజైన్లతో మరింత అందంగా అలంకరిస్తారు.

8. పూరాడం (Pooradam)

ఓనం ఎనిమిదవ రోజు (పూరాడం రోజున) ప్రత్యేకమైన ఆచారాలు జరుగుతాయి. ఆ రోజున ‘ఓనత్తప్పన్’ అనే పేరుతో మహాబలి మహారాజు మట్టి విగ్రహాన్ని ఇళ్లలో ప్రతిష్టిస్తారు. ఆ రోజున ఆయన విగ్రహాన్ని ఉంచి, విందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ఈ రోజు నుంచే పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుంది.

9. ఉత్త్రాడం (Uthradam)

ఓనం తొమ్మిదవ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. విందుల కోసం వంటకాలు తయారు చేస్తారు. ఇంట్లో ఆనందోత్సాహం తారాస్థాయిలో ఉంటుంది.

10. తిరువోనం (Thiruvonam)

చివరి రోజు అయిన తిరువోనం అత్యంత ప్రధానమైనది. మహాబలి తన ప్రజలను దర్శించడానికి వచ్చాడనే నమ్మకంతో కుటుంబాలు ఒకటై ‘ఓనసాధ్య’ అనే విందులో పాల్గొంటారు. సాంప్రదాయ సంగీతం, నృత్యాలతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇలా అథం నుంచి తిరువోనం వరకు పది రోజులపాటు జరిగే ఉత్సవాలు కేరళ సంస్కృతిని, సమైక్యతను ప్రతిబింబిస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande