
తిరువనంతపురం, 11 జనవరి (హి.స.): కేరళ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అటు అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించడంతో పాటు పార్టీ (బీజేపీ) కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. నేడు (ఆదివారం) పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి కేరళ చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్ల్రాలు ధరించిన అమిత్ షాకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఆరేళ్లకు ఒకసారి జరిగే ‘లక్షదీపం’ ఉత్సవానికి ఆలయం సిద్ధమవుతున్న తరుణంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 14న ఆలయంలో లక్ష దీపాలను వెలిగించే మహోత్సవం జరగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు