
అమరావతి, 12 జనవరి (హి.స.)
నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని ఇస్తామని కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీనిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూటమి ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోవడం లేదు. గత రెండేళ్లుగా నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని ప్రభుత్వం ఎగ్గొట్టిందిని వైసీపీ అధినేత జగన్ (YS Jagan) ఆరోపించారు. జాతీయ యువజన దినోత్సవం (National Youth Day) సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ప్రభుత్వంపై ఆయన విమర్శల వర్షాన్ని కురిపించారు. యువత లక్ష్య సాధన దిశగా దృఢ సంకల్పంతో పనిచేస్తే దేశం బలోపేతమవుతుందని స్వామి వివేకానంద విశ్వసించారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా యువతకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి యువత తమ లక్ష్యసాధన దిశగా పనిచేసేందుకు వీలు కల్పించాలన్నారు.
అనంతరం పలు ఆరోపణలు చేస్తూ.. విద్యా దీవెన కింద రూ. 4,900 కోట్లు, వసతి దీవెన కింద రూ. 2,200 కోట్ల బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని మండిపడ్డారు. గత ఎనిమిది త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉండటం వల్ల నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులను నిలిపివేయడం యువత నైపుణ్యాభివృద్ధిని దెబ్బతీయడమేనని జగన్ ధ్వజమెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV