
ఖమ్మం, 13 జనవరి (హి.స.)
అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే కర్రకాల్చి వాత పెట్టినా.. గత పాలకులకు ఇంకా జ్ఞానం రాలేదు... ఒళ్లంతా విషం నింపుకొని రోడ్ల మీద కారుకూతలు కూస్తున్న ఆనాటి 'ప్రభువుల'కు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాలుగోసారి వాత తప్పదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అశ్వారావుపేటలోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ మద్దతుదారులైన సర్పంచుల సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ... పదేళ్ల పాలనలో పేదవాడికి ఇల్లు కట్టించాలనే జ్ఞానం కూడా లేని అప్పటి పాలకులు, ఇప్పుడు అధికారం పోయిందన్న అక్కసుతో సోల్లు వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. పదేళ్లలో నియోజకవర్గానికి కనీసం 10 ఇళ్లు కూడా ఇవ్వని వారు ఇప్పుడు తమ ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు