
అమరావతి, 16 జనవరి (హి.స.)
విజయవాడ: ప్రజలకు సంక్రాంతి కానుకగా విజయవాడ వెస్ట్ బైపాస్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా నుంచి కృష్ణా జిల్లా పెదఅవుటుపల్లి వరకు నిర్మించిన రహదారిని అధికారులు ఒకవైపు అందుబాటులోకి తెచ్చి వాహనాలను అనుమతించారు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దీన్ని ప్రారంభించారు. తొలుత ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల వాహనాలు, ఆ తర్వాత ఇతర వాహనాలను పంపించారు. మార్చిలోపు మరో వైపు రహదారిని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు.
చెన్నై, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు.. కాజా టోల్‌గేట్ దాటిన తర్వాత వెస్ట్ బైపాస్‌లోకి వచ్చి.. గొల్లపూడి మీదుగా చిన్నఅవుటపల్లి వరకు వెళ్లి, అక్కడ ఏలూరువైపు హైవేలోకి చేరుకొని వెళ్లిపోవచ్చు. ఇప్పటికే గొల్లపూడి నుంచి చిన్నఅవుటపల్లి మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. నేటి నుంచి కాజా వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఏలూరువైపు వెళ్లొచ్చు. అలాగే గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఈ బైపాస్‌లో గొల్లపూడి వద్ద విజయవాడ-హైదరాబాద్ హైవేలోకి చేరుకొని హైదరాబాద్ వైపు వెళ్లిపోవచ్చు. దీంతో గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాల్లో ఏలూరు, హైదరాబాద్ వెళ్లే వాహనాలేవీ.. విజయవాడ నగరంలోకి రావాల్సిన అవసరం ఉండదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ