
హైదరాబాద్, 17 జనవరి (హి.స.)
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం బీఆర్ఎస్ చేపట్టిన ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పలువురు నిరసనకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద తలసాని మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా? అని ప్రశ్నించారు. ర్యాలీ చేస్తామని ఐదు రోజుల కింద మేము అనుమతి కోరితే, రాత్రి 10:40 గంటలకు పోలీసులు రిజెక్ట్ చేశారని తెలిపారు.
ముందే ర్యాలీకి అనుమతి లేదని తెలిపితే మేము కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే వాళ్ళం కదా? అని వెల్లడించారు. అనుమతి లేని సెక్రటేరియట్ ముందు రేవంత్ రెడ్డి ర్యాలీ చేయవచ్చు.. రేవంత్ రెడ్డి ర్యాలీకి వెళ్ళే ప్రాంతంలో ఎవరైనా అడ్డుకుంటే వారిని అరెస్ట్ చేస్తారని ఫైర్ అయ్యారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు