
ఢిల్లీ,16, జనవరి (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రాణాంతక స్థాయికి చేరింది. శ్వాస తీసుకోవడమే కాదు, జీవితం కూడా కుదించేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, 2024 సంవత్సరంలో శ్వాసకోశ మరియు గుండె సంబంధిత వ్యాధుల కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ గణాంకాలను సగటుగా తీసుకుంటే, ఢిల్లీలో ప్రతిరోజూ సుమారు 25 మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2024లో శ్వాసకోశ వ్యాధుల వల్ల 9,211 మరణాలు నమోదయ్యాయి. ఇది 2023లో నమోదైన 8,801 మరణాలతో పోలిస్తే స్పష్టమైన పెరుగుదల. ఉబ్బసం, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ వంటి వ్యాధులు ప్రధాన కారణాలుగా నిపుణులు గుర్తిస్తున్నారు. కాలుష్యభరితమైన గాలి, దుమ్ము, పొగ, వాహనాల ఉద్గారాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ