
ఢిల్లీ,16, జనవరి (హి.స.) భారతీయ జనతా పార్టీకి మరికొన్ని రోజుల్లో కొత్త సారథి రానున్నారు. పార్టీ నూతన అధ్యక్షుడి కోసం ఎన్నిక తేదీని భాజపా శుక్రవారం ప్రకటించింది. ఈ పదవికి జనవరి 19న నామినేషన్లు దాఖలు కానున్నట్లు తెలిపింది. ఆ మరుసటి రోజు జనవరి 20న కొత్త అధ్యక్షుడి (BJP New President) పేరును ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు భాజపా (BJP) రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 19వ తేదీ మధ్యాహ్నం 2-4 గంటల మధ్య అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించవచ్చని లక్ష్మణ్ తెలిపారు. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన చేపడతామన్నారు. అదేరోజు సాయంత్రం 5-6 గంటల మధ్య నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నిక అవసరమైతే జనవరి 20న పోలింగ్ నిర్వహించి విజేతను ప్రకటిస్తామన్నారు. ఈ ప్రక్రియంతా భాజపా ప్రధాన కార్యాలయంలో జరగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ