
హైదరాబాద్, 17 జనవరి (హి.స.) సికింద్రాబాద్ చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని, ఈ ప్రాంతాన్ని ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేడు భారత్ రాష్ట్ర సమితి (BRS) తలపెట్టిన 'శాంతి ర్యాలీ' ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో పాటు, పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేయడంతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం నినాదంతో బీఆర్ఎస్ నేడు భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగాల్సి ఉంది. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఈ ప్రదర్శనకు అనుమతి ఇవ్వనట్లు తెలుస్తోంది. రైల్వే స్టేషన్, ప్యాట్నీ సెంటర్ల వద్ద ఇవాళ తెల్లవారుజాము నుంచే భారీగా పోలీసు బలగాలను మోహరించాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు