
అమరావతి, 01 అక్టోబర్ (హి.స.)రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఒకవైపు ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండగా, మరోవైపు అక్టోబరు మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుందని, అక్టోబరు 4, 5 తేదీల్లో మాత్రం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కోస్తాంధ్ర, యానాంలో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంబడి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు గురు రేపు శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల పడే సూచనలు ఉన్నాయని, గంటకు 30-50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. శుక్రవారం కూడా రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగనున్నాయి.
తెలంగాణలో ఇలా
తెలంగాణ విషయానికి వస్తే.. నైరుతి రుతుపవనాలు దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల మీదుగా క్రమంగా ఉపసంహరణ దిశగా సాగుతున్నాయి. గతంలో దక్షిణ తెలంగాణ మీదుగా కొనసాగిన ద్రోణి ప్రస్తుతం దక్షిణ కర్ణాటక-తమిళనాడు మీదుగా మన్నార్ సింధుశాఖ వైపు కదిలిపోయింది. దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఎలాంటి వర్ష సూచన లేదని, పూర్తిగా పొడి వాతావరణమే కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV