
ఆత్కూరు, 10 అక్టోబర్ (హి.స.)దేశంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపై భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు.
ఈరోజు(శనివారం) కృష్ణా జిల్లా ఆత్కూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. రాజ్యాంగబద్ధ సంస్థను రాజకీయాలతో ముడిపెట్టడం, వ్యక్తిగత విమర్శలు సరికాదన్నారు. నిరాధార ఆరోపణలతో సీఈసీ, ప్రధాని రాజీనామా చేయాలనే డిమాండ్ సమంజసం కాదని చెప్పుకొచ్చారు. ఓట్లు మూకుమ్మడిగా తొలగించారనేది అపోహ మాత్రమే అని స్పష్టం చేశారు. గెలిస్తే తమ ఘనత అని.. ఓడిపోతే ఈవీఎమ్లను నిందించడం హాస్యాస్పదమంటూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను మూకుమ్మడిగా తొలగించారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కేవలం అపోహ మాత్రమేనని కొట్టిపారేశారు.దేశాన్ని కించపరిచే ప్రయత్నం చేయొద్దన్నారు. ఇప్పటికే కొన్ని పాశ్చాత్య పశ్చిమ దేశాలు.. భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాయని తెలిపారు. ‘మన దేశంలో జరిగే వ్యవస్థను మనమే అవహేళన చేయడం మంచికాదు’ అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV