విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల మూడో రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం
శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
H


విజయవాడ, 13 అక్టోబర్ (హి.స.)విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల మూడో రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. చేతిలో అమృత పాత్ర, గరిటెతో అన్నప్రదాతగా కొలువైన అమ్మవారిని దర్శించుకుంటే ఇంట్లో అన్నపూర్ణత, ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.

తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని ఉపనిషత్తులు ఉద్ఘాటించాయి. జీవకోటికి ప్రాణాధారమైన అన్నాన్ని ప్రసాదించే సాక్షాత్తు దేవతగా అన్నపూర్ణాదేవిని భక్తులు ఆరాధిస్తారు. ఈ అలంకారంలో అమ్మవారు తన వామ హస్తంలో అమృతాన్నంతో నిండిన బంగారు పాత్రను, కుడి చేతిలో రత్నాలు పొదిగిన గరిటెను ధరించి, ఆదిదేవుడైన పరమేశ్వరుడికి భిక్షను సమర్పిస్తున్న దివ్య రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande