
హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)
ఈ నెల 24వ తేదీన విపక్ష 'ఇండియా' (INDIA) కూటమి ఆధ్వర్యంలో తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. రాబోయే రాజకీయ సమీకరణాలు, ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా సుమారు లక్ష మంది జనసమీకరణతో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నేతలు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. సభా వేదిక ఎంపిక, రవాణా, భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే పీసీసీ ముఖ్య నేతలు, మంత్రులు ప్రత్యేక కమిటీలుగా ఏర్పడి సమన్వయం చేసుకుంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక బహిరంగ సభకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తో పాటు ఇండియా కూటమిలోని జాతీయ స్థాయి అగ్రనేతలు, ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకతాటి పైకి తెస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో సాగుతున్న పోరాటంలో భాగంగా హైదరాబాద్ సభను అత్యంత కీలక మైలురాయి గా మలచాలని కూటమి నేతలు భావిస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..