
హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.)
ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ చేసిన ట్వీట్ ఆధారంగా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ ఆయన నగరంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని అస్థిపరచడానికి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడానికి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నేరుగానే నిధులు అందుతున్నాయని మేరీ మిల్బెన్ బట్టబయలు చేశారని రామచందర్ రావు అన్నారు. దేశంలో మతపరమైన అల్లర్లను సృష్టించేందుకు ఆ నిధులు భారత్లోకి వస్తున్నాయని తెలిపారు. గతంలో సీఏఏ (CAA) ఆందోళనల సమయంలో షాహీన్ బాగ్ కేసులోనూ ఇదే రకమైన పరిస్థితులను మనం చూశామని అన్నారు. ఇప్పుడు కూడా ఆప్ (AAP) ఫ్రంట్ ఆర్గనైజేషన్ అయిన సీజేపీని దీనికోసం పూర్తిగా వాడుకుంటోందని ఫైర్ అయ్యారు. జార్జ్ సోరోస్ వంటి విదేశీ ఏజెన్సీల నుంచి వీరికి ఏవిధంగా నిధులు అందుతున్నాయనేది దీని ద్వారా స్పష్టమవుతోందని రామచందర్ రావు ధ్వజమెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు