
హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.)
విద్యుత్ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తప్పు తాము చేసి, ఆ నెపాన్ని అధికారులపై నెట్టడం సీఎం, మంత్రులకు పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. 'ప్రజలు, ఉద్యోగులు మీ ఉద్యోగాలు ఊడగోడుతారు చూస్కో రేవంత్' అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలకు, విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని హరీశ్ రావు విమర్శించారు. కనీసం బొగ్గు నిల్వలు కూడా పెట్టుకోకుండా, ఎలాంటి సమీక్షలు నిర్వహించకుండా విద్యుత్ రంగాన్ని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఆ నెపమంతా అధికారులపై మోపి, తాము మాత్రం శుద్ధపూసలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత 9 నెలలుగా ఎల్నినో ప్రభావం గురించి వాతావరణ శాఖ, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నప్పటికీ.. ఈ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రలో ఉండిపోయిందని హరీశ్ రావు విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు