
అమరావతి , 15 అక్టోబర్ (హి.స.)విజయవాడ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు విజయవాడలో జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సరస్ మేళాలో స్టాళ్లను పరిశీలించారు. సహజ ఉత్పత్తులు, చేనేత వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్స్ లను రాష్ట్రపతి వీక్షించారు. ఉత్పత్తుల ప్రత్యేకతలపై డ్వాక్రా మహిళలను అడిగి తెలుసుకున్నారు.
డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనకు 650 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 'స్వయం ఏపీ' బ్రాండ్ పేరుతో ఉత్పత్తులకు ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుంది. నేటి నుంచి ఈనెల 31 వరకు 14 రోజులపాటు సరస్ మేళా కార్యక్రమం ఉంటుంది.
మహిళలు తయారు చేసిన వస్తువులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో సరస్ మేళాను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాల ప్రతినిధులు, హస్త కళాకారులు తమ అరుదైన ఉత్పత్తులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్, రామ్మోహన్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్