
విజయవాడ, 15 అక్టోబర్ (హి.స.)మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు.ఢిల్లీ వెలుపల తొలిసారిగా స్వయం సహాయ సంఘాల జాతీయ సరస్ మేళను ప్రారంభించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా అభినందించారు.
విజయవాడలో ఈ రోజు గురువారం జాతీయ సరస్ మేళా ( Saras Mela ) ను ప్రారంభించి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. విజయవాడకు రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని.. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునే అవకాశం లభించిందన్నారు. ‘ఏపీ ఒడిశా రాష్ట్రానికి పక్కనే ఉన్నప్పటికీ తెలుగు భాషలో నేను మాట్లాడలేకపోతున్నాను. త్వరలోనే తెలుగు భాషను కూడా నేర్చుకుని మీతో మాట్లాడేందుకు వస్తానని హామీ ఇస్తున్నాను. మహిళలను ఇక లక్ పతీ దీదిలుగా కాదు కరోడ్ పతీ దీదిలుగా మార్చాలి’అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు.‘దేశవ్యాప్తంగా చేపట్టిన చర్యల వల్ల ఎస్ హెచ్ జీల ఆర్ధిక స్థితిగతులు మారాయి. ఎస్ హెచ్ జీ ల ద్వారా మహిళల్లో మరింత చైతన్యం పెరిగింది. వారికి మరిన్ని వనరులు అందేలా ప్రభుత్వాలు చూడాలి. గ్రామీణ అజీవికా మిషన్ ద్వారా మహిళలు నేతృత్వం వహించే మరిన్ని సంస్థలు ప్రారంభం కావాలి. మధ్యవర్తుల వ్యవస్థను తొలగించేలా అన్ని వ్యవస్థలూ మార్పులు తీసుకురావాలి’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.
వ్యవసాయ రంగంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమైనదని రాష్ట్రపతి వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక, సాంకేతిక సామాజిక సాధికారత దిశగా కొత్త మార్గం లభించిందన్నారు.‘దేశాన్ని ముందుకు నడిపేలా లక్ పతీ దీది కార్యక్రమం పెద్ద ఎత్తున తోడ్పడుతోంది. గ్రామీణ మహిళలు తమ ఆదాయాన్ని పెంచుకునేలా ఈ స్వయం సహాయ సంఘాలు సహకారం అందిస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల జీవనాన్ని దగ్గరి నుంచి పరిశీలించే సౌభాగ్యం నాకు కలిగింది’అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు.
దేవీ శరన్నవరాత్రుల వేళ, కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ సరస్ మేళా ఏర్పాటు చేయటం అభినందనీయం అని కొనియాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV