
మదనపల్లి, 15 అక్టోబర్ (హి.స.) క్షణికావేశంలో ఓ భర్త కరుడుగట్టిన నేరస్థుడిగా మారాడు. ఓ లాడ్జిలో భార్యను భర్త బీర్ బాటిల్తో పొడిచి హతమార్చిన దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....కర్ణాటక రాష్ట్ర పరిధిలోని ముల్బాగల్ మండలం కురుప్ పేటకు చెందిన నవీద్ భాషా, రూబియా తాజ్ భార్యాభర్తలు. వ్యక్తిగత పనుల నిమిత్తం వీరు రాత్రి మదనపల్లెకు చేరుకున్నారు. పట్టణ కేంద్రంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని ఒక లాడ్జిలో బస చేసేందుకు గదిని అద్దెకు తీసుకున్నారు. రాత్రి వరకూ ఆ లాడ్జి గదిలో ఇద్దరూ మామూలుగానే గడిపారు. అంతా సవ్యంగానే ఉందని లాడ్జి సిబ్బంది సైతం భావించారు. అర్థరాత్రి దాటిన తర్వాత ఇద్దరి మధ్య ఏదో విషయమై తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు సమాచారం.గురువారం తెల్లవారుజామున భార్యాభర్తల మధ్య గొడవ ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంది. ఆవేశంతో ఊగిపోయిన నవీద్ భాషా లాడ్జి గదిలో ఉన్న బీరు బాటిల్ చేతిలోకి తీసుకున్నాడు. క్షణాల వ్యవధిలో విచక్షణారహితంగా భార్య రూబియా తాజ్ తలపై విపరీతంగా దాడి చేశాడు.
లాడ్జి నిర్వాహకుల సమాచారం మేరకు పోలీసులు స్పాట్కు చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు నవీద్ భాషను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు అసలు కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV