స్థానికసంస్థల ఎన్నికలలో పోటీకి జనసేన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కూటమి నేతల జరిపిన చర్చలు సఫలం కావడంతో.. జనసేన పార్టీ ఎన్నికలకు శంఖారావం మోగించింది.
జనసేన


అమరావతి, 15 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కూటమి నేతల జరిపిన చర్చలు సఫలం కావడంతో.. జనసేన పార్టీ ఎన్నికలకు శంఖారావం మోగించింది.

జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే ఆశావహులకు ఓపెన్ ఆఫర్ ఇస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. మేయర్, కార్పొరేటర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ తదితర పదవులకు పోటీ చేయాలనుకునే వారు పార్టీ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చారు.ఇందులో భాగంగా రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను జనసేన అధిష్ఠానం అధికారికంగా ప్రారంభించింది.

ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, మండల పరిషత్, జిల్లా పరిషత్లతో పాటు పంచాయతీల్లో పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు వెంటనే తమ పూర్తి బయోడేటా తో కూడిన దరఖాస్తులను సమర్పించాలని పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఆశావహుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అధికారిక పోర్టల్ (jsplocalbodyelections.com) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ జనసేనా పార్టీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రకటన విడుదల చేసింది.

కూటమి భాగస్వామ్యంలో జనసేనకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని పవన్ కల్యాణ్ ఇటీవల స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో జనసైనికులు చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ, స్థానిక సంస్థల్లో కూడా సరైన భాగస్వామ్యం ఉండాలని అన్నారు. పార్టీ ఇప్పుడు కేవలం సీట్ల పంపకం కాకుండా, ప్రజలకు దగ్గరగా ఉండి సమస్యలు పరిష్కరించగల అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఓపెన్ ఆఫర్ ద్వారా జనసేన క్షేత్రస్థాయిలో కొత్త శక్తిని చేర్చుకోవాలని భావిస్తోంది. గతంలో ఎన్నికల్లో పోటీ చేసినవారు, పార్టీ కార్యకర్తలు, సామాజిక సేవ చేస్తున్నవారు, యువ నాయకులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించిన తర్వాత స్థానిక కమిటీలు, కేంద్ర నాయకత్వం స్థాయిలో పరిశీలన జరుగుతుంది. చివరి నిర్ణయం మాత్రం పవన్ కల్యాణ్ చేతిలోనే ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande