ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోండి - ఎంపీ మద్దిల గురుమూర్తి
అక్టోబర్ 14న రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రస్తావిస్తూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మద్దిల గురుమూర్తి!


తిరుపతి, 15 అక్టోబర్ (హి.స.)రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, శాంతియుతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. అభ్యర్థులకు రక్షణ కల్పించాలని ఈసీ, కలెక్టర్, ఎస్పీలకు లేఖలు రాశారు.

అక్టోబర్ 14న రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రస్తావిస్తూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతూ కుట్రలు పన్నుతోందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ధ్వజమెత్తారు.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో వైఎస్సార్సీపీకి చెందిన బలమైన అభ్యర్థులను పోటీకి దూరం చేయాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగాన్ని తమకు అనకూలంగా ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల్లో అవసరమైన పరిపాలనా సౌకర్యాలు కల్పించి, అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.

రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల నుంచి తహసీల్దార్లు, ఇతర ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ చట్టప్రకారం విధులు నిర్వర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి వ్యక్తిగత సేవకులు కాదు. ప్రజలకు సేవ చేయడానికి రాజ్యాంగబద్ధమైన బాధ్యతతో పని చేస్తున్నారు. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు పొందుతున్న అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పోలీసు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, ఆ హక్కుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande