
అమరావతి , 20 అక్టోబర్ (హి.స.)విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ దుర్గాదేవిని దర్శించుకున్నారు. అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో అలంకరించి ఉండగా, ఆలయ అర్చకులు గవర్నర్కు సాంప్రదాయ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగింది.
ఉత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. రద్దీని నియంత్రించేందుకు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచారు. తాగునీరు, క్యూలైన్లు, ఇతర మౌలిక సదుపాయాల విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రాజరాజేశ్వరి దేవి అలంకరణకు ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యం ఉండటంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ కుటుంబాల సుఖసంతోషాలు, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్