
అమరావతి , 20 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంగళగిరి నియోజకవర్గం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కీలక నేతలు పార్టీ మారడం వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మంగళగిరికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు దామర్ల కుబేరస్వామి టీడీపీలో చేరగా, అదే ప్రాంతానికి చెందిన మరో సీనియర్ నాయకుడు తోలేటి రవీంద్ర కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు దుగ్గిరాల మండలానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు షేక్ అబ్దుల్ సలాం కూడా టీడీపీలో చేరారు. మంత్రి లోకేశ్ వారికి పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీలో చేరిన నాయకులు తమ అనుచరులతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానికంగా తమకు ఉన్న పరిచయాలు, రాజకీయ అనుభవంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు భావిస్తున్నట్లు సమాచారం.
మంగళగిరి నియోజకవర్గంలో గత కొంతకాలంగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజల్లో తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుల పార్టీ మార్పు రాబోయే రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. టీడీపీ నాయకత్వం కొత్తగా చేరిన నేతలకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది, వారి చేరికతో క్షేత్రస్థాయిలో పార్టీకి ఎంతవరకు బలం పెరుగుతుంది అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. మరోవైపు, వైఎస్సార్సీపీ నాయకత్వం ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తుందనేది కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న రోజుల్లో మంగళగిరి రాజకీయాల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయా అన్నది వేచి చూడాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్