
న్యూఢిల్లీ:, 22 అక్టోబర్ (హి.స.)
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్తో పాటు పలువురు ప్రముఖ నాయకులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, హోంమంత్రి అమిత్ షా పరిపాలనా దక్షత భారత అంతర్గత భద్రతా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చింది. ముఖ్యంగా మావోయిజం ముప్పును అంతం చేయడంలో, నశా ముక్త (మత్తుపదార్థాలు లేని) సమాజాన్ని నిర్మించడంలో సాధించిన విజయాలు విశేషమైనవి. ప్రజల సేవలో ఆయన సుదీర్ఘకాలం, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, దేశంలో నక్సలిజాన్ని తుడిచిపెట్టి అంతర్గత భద్రతను బలోపేతం చేయడంలో, సహకార రంగానికి నూతన దిశను నిర్దేశించడంలో అమిత్ షా కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. జాతీయ ప్రయోజనాల పట్ల ఆయనకున్న కట్టుబాటు కోట్లాది మంది భారతీయులకు నిరంతర ప్రోత్సాహాన్ని ఇస్తుందని, ఆయన అనుభవం, శక్తి దేశ ప్రగతికి మరింత దోహదపడాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ స్పందిస్తూ, అంతర్గత భద్రతను పటిష్టం చేయడంతో పాటు సహకార రంగానికి కొత్త ఊపిరి పోసేందుకు అమిత్ షా ఎంతో నిష్టతో, శ్రమతో పనిచేస్తున్నారన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో నిరంతరం దేశసేవలో కొనసాగాలని భగవంతుడిని ప్రార్థించారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వంలో 'నక్సల్ రహిత భారత్' సంకల్పాన్ని అమిత్ షా సాకారం చేయడం ఒక చారిత్రక ఘట్టమని అభివర్ణించారు. 2029 నాటికి 'నశా ముక్త భారత్ అభియాన్' లక్ష్యాన్ని పూర్తిచేసే దిశగా ఆయన చూపిన దూరదృష్టి యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, అమిత్ షాను ప్రజాదరణ పొందిన నాయకుడిగా, సమర్థవంతమైన వ్యూహకర్తగా అభివర్ణించారు. బాబా సోమనాథుని ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.
అలాగే కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, బిజెపి జాతీయ నాయకుడు నితిన్ నవీన్ తదితరులు కూడా అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వం, దృఢ సంకల్పం దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముద్ర వేశాయని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi